Monday, November 28, 2011

గోపాలరావు


నా విద్యార్ధి  జీవితం మొత్తం లో గుర్తుంచుకోదగిన అతి తక్కువ మంది లో మా తెలుగు మాష్టారు  గోపాలరావు  గారు ఒకరు. గోపాలరావు మాష్టారు  ఆరవ తరగతి నుండి  పదవ తరగతి వరకు తెలుగు చెప్తారు, తెలుగు చెప్పటమే కాక ప్రిన్సిపాల్ గా కూడా భాద్యతలు నిర్వహించేవారు . తెలుగు మాష్టారు  క్లాసు అంటే ఎక్కడలేని ఉత్సాహం  నాకు, అందుకు కారణం మాష్టారు  పాఠం చెప్పే విధానం .

మా మాష్టారు టెక్స్ట్ బుక్ లో  ఉన్న క్రమం లో కాక  ఏ  పాఠం కావాలో మమ్మల్ని అడిగావారు . ఎక్కువమంది ఏది కోరితే ఆ పాఠం చెప్పేవారు .  మా మాస్టారు  పద్య భాగం లో పాఠం  చెప్పేటప్పుడు పద్యాన్ని పాడి వినిపించేవారు . ఇలా పద్యాన్ని పాడి చెప్పే తెలుగు మాస్టార్లు ఇప్పుడు ఉన్నారో లేదో .   పాఠం చెప్పిన తరువాత సమయం ఉంటే ఏదైనా కథ చెప్పేవారు . ఒక్కోసారి కథ చెప్పకపోతే  అందరు సార్..సార్  అంటూ దీర్ఘాలు తీసేవారు .

మాష్టారు  పాఠం చెప్పేటప్పుడు ఎవరైనా వెకిలి వేషాలు  వేసారంటే  వారికి  తొడపాసం పెట్టేవారు . ఆయన తొడపాసం పెట్టారంటే తోలు ఊడి రావాల్సిందే . ఒకసారి నేను కూడా అయన తొడపాసం రుచి చూడాల్సి వచ్చింది . నా ప్రక్కన రాము, శరత్ అని రెండు కోతులు ఉండేవి . ఆ కోతుల  పక్కన కూర్చొని చెయ్యని కోతి పనికి నేను కూడా చిన్న మొత్తం లో  తొడపాసం రుచి చూసాను .

మా మాష్టారు  లో నాకు నచ్చేది ఆయన మార్కులు ఇచ్చేటప్పుడు పాటించే విధానం .గత పరీక్షల్లో కంటే మార్కులు ఎక్కువ వస్తే  ఇంకా మంచి మార్కులు తెచ్చుకోవాలంటూ ప్రోత్సహించేవారు , తగ్గితే కనుక వారికి శిక్ష తప్పదు . ఒక్కసారైనా ఫస్ట్ మార్కు తెచ్చుకొని ఆయన చేత మెప్పు పొందాలని చాల ప్రయత్నించేవాడిని . నా ప్రయత్నం ఒక్కసారి ఫలించింది. ఏమైనా నచ్చిన మాస్టారు దగ్గర  మెప్పు  పొందటం వచ్చే ఆనందం వేరు .